


హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగర సమగ్రాభివృద్ధి:
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలపై రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం
హనుమకొండ జనవరి07
హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష పై హన్మకొండ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం (ఐ డి ఓ సి)లోని సమావేశ మందిరం లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి, మంత్రి, రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి లతో కలిసి వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాఢ వీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, యూరియా, ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రబీ సీజన్ కు సంబంధించి సంసిద్ధత, తదితరు అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండి వి. పి. గౌతమ్ ను ఆదేశించారు. పైలెట్ గా చేపట్టిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అలాగే వాటికి చెల్లింపులు చేయాలని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
కాబడిన ఇళ్ల ను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని హౌసింగ్ ఏం డి ని ఆదేశింంచారు.
ఏప్రిల్ మాసం లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని అన్నారు. రెండు పడకల గదుల ఇళ్ల (2- బిహెచ్ కె) ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, స్థానిక ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకొని పొజిషన్ లో ఉన్న లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని అన్నారు. ఈనెల 20వ తేదీల్లోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలిక సదుపాయలైన మంచి నీటి సౌకర్యం తో పాటు విద్యుత్తు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలన్నారు. ఒక్కసారి లబ్ధిదారులను ఎంపిక చేశాక, ఎల్ 3, ఎల్ 2 అనే సమస్యలు ఉత్పన్నం కాకూడదని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాలలో రెండు పడక గదులకు లబ్ధిదారుల ఎంపిక జనవరి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ల ను ఆదేశించారు. రెండు పడక గదుల ఇండ్లకు సంబంధించిన అన్ని సమస్యలు ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.
ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య నెలకొని ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయం తో పని చేయాలని తెలిపారు. కాజీపేట బస్టాండ్ స్థలం కోసం రైల్వే శాఖ ప్రతిపాదించిన స్థలం కోసం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల కలెక్టర్లు రైల్వే ట్రాక్ ల పక్కన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. భూభారతిలో పెండింగ్ అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలని, అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, సాదా బైనామా దరఖాస్తులను కూడా పరిష్కరించాలన్నారు
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ
కమలాపూర్, న్యూ శాంపేటలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టమని, తుది దశకు చేరుకుందన్నారు. అంబేద్కర్ నగర్ రెండు పడక గదుల ఇండ్లకు సంబంధించి తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ నిర్వహణ కు రూ. 30 లక్షలతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపడుతునట్లు తెలిపారు. రైతులకు యురియా పంపిణీకి సంబంధించి జిల్లా లో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సాఫీ గా పంపిణీ జరుగుతుందని, సరిపోను యూరియా నిల్వలు అందుబాటు లో ఉన్నాయని అన్నారు. అధికారులు కొంత కఠినంగా వ్యవహరించినా అంతిమంగా ప్రజలకు న్యాయం జరగాలని అన్నారు. యూరియా పంపిణీలో ఏ చిన్న సమస్య తలెత్తకుండా కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు మొదటి దశ స్ట్రెచ్ పనుల భూసేకరణ పూర్తి కావడం జరిగిందని, రెండవ దశ స్ట్రెచ్ పనులను రూ.305 కోట్ల తో చేపట్టే భూసేకరణకు త్వరగా టెండర్ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.
భద్రకాళి మాడ వీధుల పనులను రూ.30 కోట్ల తో చేపడుతున్నామని, పూజారుల నివాస గదులు సత్రం పనులు కొనసాగుతున్నాయని మాడ వీధులకు చెందిన లో లయింగ్ ప్రాంతాలు పూడ్చే పనులు పూర్తి
అయ్యాయని తెలిపారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని అన్నారు. సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అధికారులు వారానికి ఒక సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 12 నియోజకవర్గాలలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ నగరాన్ని కూడా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ ను పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ తో పాటు అండర్ డ్రైనేజ్ సిస్టం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చినప్పుడు 4వేల కోట్ల పైచిలుకు పరిపాలనపరమైన అనుమతులను ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా గడచిన వర్షాకాలంలో వరదలు ఎక్కడైతే ఎక్కువగా వచ్చాయో ఆ ప్రాంతంలో భవిష్యత్తు కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను మొదటి దశలో రాబోయే వారం రోజుల్లో టెండర్లను పిలవడం జరుగుతుందన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీటి కోసం సుమారు 570 కోట్ల రూపాయలకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. వరంగల్ నగరంలో అద్భుతమైన ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేసి వరంగల్ తో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత హెల్త్ హబ్ గా వరంగల్ నిలుస్తుందన్నారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కొద్ది నెలల్లోనే ఎలా పూర్తి చేయాలని అంశంపై అధికారులతో సమీక్షించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. మధ్యతరగతి ప్రజల స్థాయికి తగినట్లుగా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమాన్ని వరంగల్ లో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కొంత మిగిలి ఉందని, వాటి పనులను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. భద్రకాళి ఆలయానికి సంబంధించి మాఢ వీధుల నిర్మాణ పనులు, మిగతా చెరువు పూడికతీత పనులు, ఆలయ పునరుద్ధరణ పనులు గడువు నిర్ణయించి ఎలా పూర్తి చేయాలనే దానిపై చర్చించినట్లు పేర్కొన్నారు. వరంగల్ ను హైదరాబాద్ తర్వాత రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని, అదే తరహాలో వరంగల్ పట్టణాన్ని మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు. సెక్టార్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆనాడు మధ్యలో వదిలేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కూడా వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురవుతుందని దానిని కూడా రివైజ్డ్ చేసేందుకు క్షుణ్ణంగా సమీక్షలో చర్చించినట్లు తెలిపారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ కు వచ్చినప్పుడు వరంగల్ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు నాళాలు, రిటైనింగ్ వాల్స్, డిస్చార్జ్ కెపాసిటీ రోడ్ల వద్ద కల్వర్టులు లేని కారణంగా పలుచోట్ల ఇల్లు నీట మునిగాయని వాటిపై కూడా చర్చించి కల్వర్టుల నిర్మాణం చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం ఉమ్మడి వరంగల్ లో అభివృద్ధిలో ముందంజలో ఉండబోతుందన్నారు. క్రికెట్ స్టేడియం తో పాటు స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు( డిపిఆర్)ను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ ను అభివృద్ధి చేసేందుకు నిధులు ఎన్ని ఖర్చయినా పారదర్శకంగా వరంగల్ పట్టణం, ఉమ్మడి వరంగల్ జిల్లాను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అద్భుతంగా.. మహా అద్భుతంగా రాబోయే 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండే విధంగా రాతి కట్టడాలతో ఇప్పటికే 95 శాతం ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు తెలిపారు. మేడారం జాతర ఈనెల 28 నుండి 31 వ తేదీల వరకు జరుగుతుందని చెప్పారు. అమ్మవార్లు ఉన్న ప్రాంతాన్ని పునరుద్ధరణ పనులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 250 నుండి 300 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి అద్భుతంగా పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో బస చేయాలని ఈనెల 18వ తేదీన అక్కడికి చేరుకుంటారని, రాత్రి అక్కడే బస చేస్తారని పేర్కొన్నారు. 19వ తేదీన ఉదయం ఆలయ పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కోట్లాదిమంది భక్తులు దర్శించుకుంటారని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనులతో పాటు గిరిజనేతరులు కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.
జాతర సందర్భంగా కానీ, జాతర ముందు కానీ, జాతర తర్వాత కాని భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను సమీక్షా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో వరంగల్ గొప్పతనాన్ని, వరంగల్ అవసరాన్ని గుర్తించి వరంగల్ ఎయిర్పోర్ట్ ను తీసుకువస్తున్నారని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పై అభిమానానికి, శ్రద్ధకు నిదర్శనం ఎయిర్పోర్ట్ అని పేర్కొన్నారు. ఇంటి ఇలవేల్పుగా ఆదివాసీలకే కాకుండా గిరిజనేతరులు, కోట్లాదిమంది భక్తుల కొలువుదీరిన దేవతలు సమ్మక్క సారలమ్మలు అని అన్నారు. కొంగు బంగారం లాగా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి కులము మతము ప్రాంతం అనే భేదాలు లేకుండా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. గద్దెలతోపాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణ పనులు మొదలు పెట్టామని.. వాటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను ప్రారంభించారని అన్నారు. పునర్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

