
భూపాలపల్లి
రబీ సాగుకు నీటి లభ్యత, ఎరువుల సరఫరాపై
ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న 29 వేల ఎకరాలు, వరి 97,570 ఎకరాల్లో సాగవుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. యూరియా కొరత లేదని స్పష్టం చేస్తూ, ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచే యూరియా విక్రయాలు ప్రారంభించాలన్నారు. విత్తనాలు, ఎరువుల అందుబాటును నిరంతరం తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 2,600 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని, అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఇండెంట్లు పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా రద్దీ నియంత్రణకు అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, అలాగే ఒకేసారి కాకుండా విడతల వారీగా యూరియా పంపిణీ చేయాలని తెలిపారు.
వేసవి కాలంలో మైనర్, మేజర్ నీటి వనరుల కింద పంటల సాగు, నీటి లభ్యత తదితర అంశాలపై వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఇరిగేషన్ అధికారులు బసవ ప్రసాద్, తిరుపతిరావు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఇరిగేషన్ డీఈలు తదితరులు పాల్గొన్నారు.

